వరంగల్‌లోని కాంగ్రెస్ చేపట్టిన రైతు సంఘర్షణ సభలో జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్ల రాలేదని, ఎంతోమంది త్యాగాలతో ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇది తెలంగాణ ప్రజల స్పప్నమన్నారు. కానీ, తెలంగాణ వల్ల బాగుపడింది మాత్రం ఒక్క కుటుంబమేనన్నారు. మీ అందరి కల నెరవేర్చడానికి అనేకమంది రక్తం చిందించారని, కాంగ్రెస్ పోరాటం కొనసాగించిందని, సోనియాగాంధీ చొరవ వల్ల తెలంగాణ ఏర్పడిందని రాహుల్ గాంధీ అన్నారు. ఛత్తీస్ ఘడ్‌లో రైతులు రుణమాఫీ అడిగారని, క్వింటాల్‌కు అక్కడ రూ. 2500 వస్తున్నాయని చెప్పారు. రైతుల మాట కేసీఆర్ వినడం లేదని.. మిర్చి, పత్తికి మద్ధతు ధర లభించడంలేదని పేర్కొన్నారు.
తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము చెప్పేది కేవలం వట్టిమాటలు కావని, తెలంగాణ రైతుల ప్రగతి గురించి తామిచ్చిన మాటను కచ్ఛితంగా నిలబెడతామని రాహుల్ హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బల్లగుద్ది చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ ఇచ్చామని చెప్పిన రాహుల్.. రైతులకు 2 లక్షల రుణమాఫీ, అలాగే 15 వేల రూపాయల సాయం రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. ఇది డిక్లరేషన్ మాత్రమే కాదని, కాంగ్రెస్ రైతులకు ఇచ్చే గ్యారంటీ రాహుల్ అన్నారు. ఈ వేదిక మీద భర్తల్ని పోగొట్టుకున్న రైతు కుటుంబాలు ఉన్నాయని, వీరి వేదనకి ఎవరు కారణమని రాహుల్ అడిగారు.
తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అంత సులువైన పని కాదని, కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామన్నారు. మీ కలని సాకారం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇక్కడున్న ముఖ్యమంత్రి పేరుకి మాత్రమే ఉన్నాడని, నిజానికి ఆయనొక రాజులా ప్రవర్తిస్తున్నాడని, రైతుల బాధ వినడం లేదని, ఇక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పడలేదని రాహుల్ అన్నారు.