గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో జంక్షన్ వరకు ఉన్న ఐటీ కంపెనీలు తమ ఆఫీస్ టైమింగ్స్ మార్చుకోవాలని సూచించింది.
ఈ రూట్లల్లో ప్రయాణం..
గచ్చిబౌలి నుంచి లింగంపల్లి: గచ్చిబౌలి జంక్షన్ వద్ద మలుపు తీసుకోవాలి. బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా దవాఖానా, మజీద్ బండ కమాన్, హెచ్‌సీయూ డీపో రోడ్డు మీదుగా వెళ్లాలి.
విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లి: క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి క్రాస్ రోడ్డు, హెచ్‌సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల రోడ్డు మీదుగా వెళ్లాలి.
కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్: జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45, మాదాపూర్ పీఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి జంక్షన్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.
కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్‌పోర్టు పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రీన్ ల్యాండ్స్, ప్రకాశ్ నగర్ టీ జంక్షన్, రసూల్‌పురా టీ జంక్షన్, సీటీవో జంక్షన్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
ఇక ప్రధానికి స్వాగతం పలికేందుకు వచ్చే ప్రముఖులకు మాత్రమే అనుమతిస్తారు. వీరంతా ఎయిర్‌పోర్టు పార్కింగ్ ఏరియాలో తమ వాహనాలను నిలుపుకోవచ్చు. సిటిజెన్స్‌తో పాటు ఇతరులు ఎయిర్‌లైన్ కాలనీ పార్కింగ్ ఏరియాలో తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. అయితే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.