భారత దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు తెలియనివారుండరు.. ఆయన వ్యూహాలతో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి.. మొన్నటి మొన్న పశ్చిమ బెంగాల్‌లో దీదీ వరకు ఎంతో మంది పీఠాన్ని ఎక్కారు.. నితీష్ కుమార్, వైఎస్ జగన్, స్టాలిన్.. ఇలా చాలా మందికే వ్యూహ రచన చేశారు పీకే.. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా.. తన టీమ్‌ను రంగంలోకి దింపి పనిమొదలు పెడతారు. అయితే, బెంగాల్ ఫలితాల తర్వాత తన వృత్తిని వదిలేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. కానీ, దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు కొన్ని ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. మరోవైపు.. ఆయన శిష్యులు కూడా వ్యూహ రచనకు తాము సైతం అంటున్నారు.. తెలంగాణలో త్వరలోనే రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమైన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కోసం పీకే శిష్యురాలు ప్రియా ఎంట్రీ ఇచ్చారు.
ప్రశాంత్ కిషోర్ టీమ్‌లో పనిచేసిన ప్రియా.. తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె.. తమిళనాడు ఎన్నికల సమయంలో పీకే టీమ్‌లో ప్రియా ప్రముఖంగా పనిచేశారని చెబుతారు.. ఆమెను ఇప్పుడు తన వ్యూహకర్తగా నియమించుకున్నారట వైఎస్ షర్మిల… ఇక, ఈ నెల 8వ తేదీన వైఎస్ షర్మిల కొత్త పార్టీ.. తెలంగాణలో ఆవిర్భవించనుంది.. ఈనెల 8వ తేదీ ఉదయం ఇడుపులపాయలో 8.30 గంటలకు ప్రార్థనలు నిర్వహించనున్న ఆమె.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి.. జేఆర్‌సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 5 గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే పార్టీ పేరు, జెండా, అజెండా ఖరారు కాగా.. 8వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక, వైఎస్ షర్మిల ఎలా ప్రసంగించాలి..? ఏ అంశాలు లేవనెత్తాలనే దానిపై ఎప్పటికప్పుడు.. ఎన్నికల వ్యూహకర్త ప్రియా సూచనలు చేయనున్నారని తెలుస్తోంది.. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్.. భారత రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు.. మరి ఆయన శిష్యురాలు.. ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి. ఏపీలో వైఎస్ జగన్‌ను తిరుగులేని విజయాన్ని అందించిన పీకే.. తెలంగాణలో తన శిష్యురాలిని ముందు పెట్టినా.. ఆయనే వ్యూహాలు అందిస్తారనే ప్రచారం కూడా లేకపోలేదు.. గత కొంత కాలంగా.. షర్మిల కొత్త పార్టీ వెనుక ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది.