Ponguleti Srinivas Reddy Gives Warning: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ మరోసారి ఫైర్ అయ్యారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా సరే.. తన అభిమానులకు అండగా ఉంటానని, తన కుటుంబ సభ్యుల్ని కాపాడుకునేందుకు తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో పొంగులేటి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తనని గుండెల్లో పెట్టుకున్న అభిమానులకు తానున్నానని భరోసా ఇచ్చారు. తన కుటుంబం జోలికొస్తే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఎవరి సొత్తు కాదని ఉద్ఘాటించారు.
అంతకుముందు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి ధ్వజమెత్తారు. కరోనావైరస్ కారణంగా రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ చేయలేదని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం, మరి వందల కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం ఎందుకు నిర్మిస్తోందని ప్రశ్నించారు. గొప్పలకు పోయే బదులు, కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఆ డబ్బును ఖర్చు చేయొచ్చు కదా అని హితవు పలికారు. పేరు, బ్రాండ్, నామస్మరణ కోసం తప్ప.. తెలంగాణ బిడ్డల బాగోగుల గురించి పాలకులు ఆలోచించడం లేదని విమర్శించారు. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణ బిడ్డలు కన్న కలలను ఏ మేర నెరవేర్చామన్న విషయంపై.. అధికారంలో ఉన్నవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క నెలలోనే ధరణిని క్రమపద్ధతిలో పెడతామని ప్రభుత్వం చెప్పినా.. ఏడాదిన్నర కాలంగా రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు.
ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతుంటే.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు ఎందుకు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని పొంగులేటి నిలదీశారు. పార్టీ తొత్తులకే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కట్టబెడుతున్నారని, సమయం వచ్చినప్పుడు ప్రజాకోర్టులో మూల్యం చెల్లించుకోకక తప్పదని హెచ్చరించారు. రాబోయే 15 ఏళ్లకైనా గోదావరి నీళ్లతో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామా? అని ప్రశ్నించారు.