జూబ్లీహిల్స్ రొమోనియా బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన కీలకమలుపులు తిరుగుతోంది. అందులో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉండటం.. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బాలికతో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ పలు ఫొటోలు, వీడియోలు బయటికి మరింత అలజడికి కారణమవుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘటనకు సంబంధించిన ఆధారాలను, ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ.. టీఆర్‌ఎస్ సర్కారు, ఎంఐఎంలపై ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ప్రతినిధి బృందం శనివారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.
బాలికపై రేప్ ఘటనను చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని కాంగ్రెస్ నేతలు భట్టి, శ్రీధర్‌బాబు మండిపడ్డారు. టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం కుమ్మౖక్కై కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని.. అందులో భాగంగానే కారులో బాలిక ఉన్న వీడియోలను రఘునందన్‌రావు విడుదల చేశారని ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు నిరసన తెలిపాయి. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ ఘటనపై స్పందించాయి. వెంటనే సమగ్ర విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.