హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీబిజీగా గడిపారు. ముచ్చింతల్ లోని శ్రీరామానుజ సమతా మూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొని సందడి చేశారు. అంతకముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భుజం తట్టి పలకరించారు. ‘క్యా బండీ.. కైసే హై’ అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత జితేందర్‌రెడ్డి, కిషన్ రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డిలను కూడా పలకరించారు. మోడీని ఆహ్వానించేందుకు వచ్చారు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి.
పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీకి బయలుదేరిన సమయంలో హుజూరా బాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా అభినందించారు. బండి సంజయ్ ప్రధాని మోదీకి ఈటలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన భుజం తట్టిన మోదీ.. ‘చోటా ఆద్మీ బడా కామ్ కర్ రే’ అని ప్రశంసించారు. ఇద్దరినీ ఆశిర్వదించారు మోడీ. రాత్రి 9.30 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరిన మోదీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జితేందర్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ వీడ్కోలు పలికారు.