Palvai Sravanthi Gives Warning To Rajagopal Reddy: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని బెదిరించిన ఆయన వైఖరిని తీవ్రంగా ఖండించారు. రాజగోపాల్ రెడ్డి తన పద్దతిని మార్చుకోవాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి.. యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మునుగోడు అభ్యర్థి కేటీఆరా, హరీశ్ రావునా లేక జగదీశ్ రెడ్డా అని మునుగోడు ప్రజలు గందరగోళానికి గురవుతున్నారన్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని విమర్షిస్తున్న వారికి ఆయన పేరు ఉచ్ఛరించే అర్హత లేదన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురి చెయ్యకుండా ఎన్నికలకు పోదామని.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి వద్ద ప్రమాణం చేద్దామా? అని టీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు. తాను స్వలాభం కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కానని స్పష్టం చేశారు.
కాగా.. మంగళవారం గట్టుప్పల్ మండలంలో రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు.. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయి.. కాంగ్రెస్‌కు మోసం చేశారని ఆరోపించారు. అంతేకాదు.. ‘రాజగోపాల్ రెడ్డి గో బ్యాక్’ అంటూ పెద్దఎత్తున నినాదాలూ చేశారు. దీంతో.. కోపాద్రిక్తులైన రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు పిచ్చి వేషాలు వేస్తున్నారని, సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్లను తరిమివేయాలని పోలీసులను ఆదేశించారు. ఒకవేళ వెళ్లకపోతే.. బీజేపీ కార్యకర్తలు వచ్చి తంతారని ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. పాల్వాయి స్రవంతి పై విధంగా స్పందించారు. మరి, ఈ వ్యవహారం మున్ముందు మరెన్ని పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.