హైడ్రా అంటే జీహెచ్‌ఎంసీకి పడటం లేదా? రెండు ప్రభుత్వ విభాగాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందా? జీతాలిచ్చేవాళ్ళంటే… జోకై పోయిందా అంటూ గ్రేటర్ అధికారులు హైడ్రా సిబ్బంది మీద ఫైరైపోతున్నారా? అసలెందుకా పరిస్థితి వచ్చింది? రెండు విభాగాలు ప్రభుత్వ అధినంలోనే ఉన్నా… ఎక్కడ తేడా కొడుతోంది? మన తిండి తిని పక్కోడి చేలో పనిచేస్తున్నారన్న అభిప్రాయం గ్రేటర్ అధికారుల్లో పెరగడానికి కారణాలేంటి? గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులు, నాలాలు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించేలా ‘హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ’ హైడ్రాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జీహెచ్‌ఎంసీలో ఉన్న డిఆర్ఎఫ్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని పనులు చేయాలని నిర్దేశించారు. ఈ క్రమంలోనే…చెరువులు పార్కుల్లో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల కార్యక్రమం నడుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 262 నిర్మాణాలను కూల్చిన హైడ్రా అధికారులు… ఆక్రమణలలో ఉన్న 111 ఎకరాల భూములను ఖాళీ చేయించారు. అయితే ప్రస్తుతం దూకుడుగా ఉన్న హైడ్రాకు, ఆ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న జిహెచ్ఎంసికి మధ్య ఇప్పుడు కోల్డ్‌వార్ మొదలైందన్న ప్రచారం కలకలం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఇటీవల భారీ వర్షాలు పడ్డప్పుడు వెంటనే స్పందించాల్సిన డీఆర్‌ఎఫ్ టీమ్‌లు అస్సలు జీహెచ్‌ఎంసీ అధికారుల ఆదేశాలను పట్టించుకోలేదట. తాము హైడ్రాకే బాధ్యులమన్నట్టు వ్యవహరించడంతో… జీతాలిచ్చే మా మాటే వినరా అంటూ గ్రేటర్ అధికారులు ఫైరైనట్టు తెలిసింది. అసలు వాళ్ళకు జీతాలు నిలిపివేయమంటూ… స్టాండింగ్ కమిటీ లో అభ్యంతరం తెలిపారట సభ్యులు. అక్రమ అనుమతులిచ్చారంటూ ఏకంగా జీహెచ్ఎంసి ఉద్యోగుల మీద హైడ్రా క్రిమినల్ కేసులు పెట్టడం కూడా కోల్డ్‌వార్‌కు మరో కారణం అంటున్నారు. అసలు ఎలాంటి విధి విధానాలు లేకుండా జీవో ద్వారా ఏర్పాటు చేసిన హైడ్రాకు జిహెచ్ఎంసి యంత్రాంగం ఎలా పనిచేస్తుందంటూ స్టాండింగ్ కమిటీ సభ్యులు నిలదీసినట్టు సమాచారం. ఎంఐఎం కార్పొరేటర్లు అయితే ఏకంగా హైడ్రాను రద్దు చేయాలంటూ తీర్మానం కోసం పట్టుబట్టారట. అసలు హైడ్రా పేరుతో…జీహెచ్ఎంసి పనులు చేయని సిబ్బందికి కార్పొరేషన్ నుంచి ఎలా జీతాలు చెల్లిస్తున్నారంటూ కమిషనర్ పై ఒత్తిడి తీసుకువచ్చారు స్టాండింగ్ కమిటీ సభ్యులు. మరోవైపు ఆగస్టు 15 నాటికి హైడ్రా దగ్గర ఉన్న జిహెచ్ఎంసికి సంబంధించిన అధికారులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో విభజించి వారందరూ కార్పొరేషన్ ఆధీనంలో పనిచేసేలా చూడాలని ఆదేశించారు కమిషనర్ అమ్రపాలి. అయినా హైడ్రా నుంచి ఉద్యోగులు వెనక్కి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్… ఇకపై వారికి జీతాలు చెల్లించే విషయంలో పూర్తి రిపోర్ట్ ఇవ్వాలంటూ అడ్మిన్ ఆఫీసర్స్‌ని ఆదేశించినట్టు సమాచారం. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చారు అంటూ.. ఇప్పటికే జిహెచ్ఎంసి కి చెందిన ఓ డిప్యూటీ కమిషనర్, ఒక టౌన్ ప్లానింగ్ అధికారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇలా రకరకాల వివాదాలు రెండు ప్రభుత్వ విభాగాల మధ్య కోల్డ్‌వార్‌కు దారి తీస్తున్నాయట. ఇప్పటికైనా క్లారిటీ రాకుంటే… ఇది మరింత ముదిరి ఎట్నుంచి ఎటో పోతుందని, ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం జీహెచ్‌ఎంసీ మీద ఫోకస్ పెడుతోందా? గ్రేటర్ ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతోందా? సిటీలో పార్టీకి బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్న పాత నేతల్ని మళ్లీ తెరమీదికి తీసుకురావాలనుకుంటోందా? ఆ విషయమై పార్టీ దగ్గరున్న ప్లాన్స్ ఏంటి? తిరిగి ఎలా పుంజుకోవాలనుకుంటోంది?
తెలంగాణలో అధికారంలోకి వచ్చాక గ్రేటర్ హైదరాబాద్ పై ఇప్పటి వరకు ఫోకస్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. కొంతమంది నాయకుల చేరికలకే పరిమితమైంది. అయితే కొత్త పిసిసి చీఫ్ నియామకం తర్వాత ఇక గ్రేటర్ మీద ఫోకస్ చేయక తప్పని అనివార్యత పెరిగింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలన్న టార్గెట్‌తో అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచిన నేతల్లో పి.జనార్ధన్‌రెడ్డి ఒకరు. ఆయనతో పాటు మరో నేత ముఖేష్ గౌడ్. అలాగే ఇటీవల దానం నాగేందర్ కూడా తిరిగి పార్టీలోకి రావడం కలిసొచ్చే అంశమేనని అంటున్నారు. ఈ క్రమంలో పాత తరం నుంచి మంచి ఇమేజ్ ఉన్న నాయకుల వారసులను ప్రోత్సహించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్లో ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోందట. పిసిసి కొత్త చీఫ్ రావడంతో కమిటీల్ని కూడా కొత్తగా వేసుకోవాల్సి ఉంది. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేయడానికి ఇమేజ్ ఉన్న నాయకుల వారసులను గుర్తించాలనుకుంటోందట పార్టీ. ఈ క్రమంలో ఇప్పటివరకు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కీలక పదవి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడి దగ్గర కూడా ప్రస్తావించినట్టు ప్రచారం జరుగుతోంది. తనకు మహిళా కోటాలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని విజయారెడ్డి కూడా లాబీయింగ్ మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. దివంగత నాయకుడు పి.జనార్ధన్‌రెడ్డికి హైదరాబాదులో మంచి ఇమేజ్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుగా పనిచేసిన ఆయన కుటుంబం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంత యాక్టివ్‌గా లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిజేఆర్ కుమారుడు విష్ణు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ లో చేరారు. కూతురు విజయా రెడ్డి మాత్రమే పార్టీలో కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు విజయారెడ్డి పదవి కోరుతున్నారు, అటు పార్టీ కూడా పాత నేతల చరిష్మాతో తిరిగి పుంజుకోవాలన్న ప్లాన్‌లో ఉంది. అందుకే ఆమెకు పీసీసీలో అవకాశం కల్పించవచ్చని అంటున్నాయి పార్టీ వర్గాలు. కానీ… పీజేఆర్ పాత వర్గం మొత్తం ఇప్పుడు చెల్లా చెదురైంది. కొద్ది మంది విజయారెడ్డితో ఉన్నా…సరైన ప్రాధాన్యత దక్కక పార్టీకి పూర్తి స్థాయిలో అండగా ఉండలేకపోతున్నారట. మరిప్పుడు విజయా రెడ్డికి ప్రాధాన్యం కల్పించి పీజేఆర్ పాత వర్గం మొత్తాన్ని మళ్ళీ యాక్టివ్ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. పాత నేతల చరిష్మా, వాళ్ళ వారసుల పనితీరు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు గట్టెక్కిస్తాయో చూడాలి మరి.