తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతోందని.. ఈ ప్రక్రియ ముగియగానే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలను టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందన్నారు. మిగతా ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందని తెలిపారు.
కేంద్రం పరిధిలో 8 లక్షల 72 వేల 243 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. సమస్యలను అర్థం చేసుకోకుండా నోటిఫికేషన్లు త్వరగా విడుదల చేయాలని ఇక్కడ బండి సంజయ్ దీక్ష చేస్తున్నారని.. ఈ ఏడుపేదో ఆయన ఢిల్లీ వెళ్లి ఏడవాలని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కు దమ్ముంటే ఉద్యోగ ఖాళీలపై కేంద్రాన్ని నిలదీసి నోటిఫికేషన్లు ఇప్పించాలని సవాల్ విసిరారు. మీ గొప్పతనంతో కేంద్రం నుంచి 50 నుంచి లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తే బాగుంటుంది. ఈ కొలువుల భర్తీ కోసం ఒక్కనాడైనా రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని నిలదీశారా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం కాంగ్రెస్ ఏనాడైనా ఆందోళన చేపట్టిందా?.. పేరుకే కాంగ్రెస్ జాతీయ పార్టీ కానీ.. బీజేపీని ఎక్కడ నిలదీయదని నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.