ఇటీవల బేగంబజార్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువతి బంధువులు ఆమె భర్త నీరజ్ పన్వార్ అనే యువకుడిని అవమానం భారంతో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీరజ్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ హోం మంత్రి మహమూద్ అలీని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మినిస్ట్ క్వార్టర్స్‌లో నీరజ్ భార్య సంజన మాట్లాడుతూ.. నా భర్తను హత్య చేసిన వారికి బెయిల్ రాకుండా చూడాలని కోరామని, నిందితులు అరెస్ట్ అయినప్పటికీ మాకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె వెల్లడించారు. మా కుటుంబ సభ్యులను మొత్తం చంపేస్తాం అని బెదిరిస్తున్నారని, నా భర్తను హత్య చేసిన వాళ్ళ వెనుక ఎవరు ఉన్నారు మాకు తెలియాలన్నారు.
అనంతరం నీరజ్ తల్లి మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేస్తాం అని హోమ్ మినిస్టర్ హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. నిందితులకు బెయిల్ రాకుండా చూస్తామని మినిస్టర్ చెప్పారని, మాకు అన్ని విధాల అండగా ఉంటామని హోమ్ మినిస్టర్ స్పష్టం చేశారన్నారు. నలబై రోజుల్లోగా నిందితులకు శిక్ష పడేలా చూడాలని, మా అమ్మాయి జీవితం నాశనం అయిందని. మాకు న్యాయం కావాలని ఆమె అన్నారు. అలాగే.. మార్వాడీ సమాజ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. నీరజ్ హత్య వెనుక పెద్దలు ఉన్నారు ఆన్న అనుమానం ఉంది. బాధితురాలికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వమని అడిగాం. బాబు భవిష్యత్ భరోసా ఇవ్వమని కోరాం. పెద్దల నిర్ణయం మేరకు ఈ హత్య జరిగింది అని ఓ మహిళ చెప్పింది. ఆ పెద్దలు ఎవరో మాకు స్పష్టత ఇవ్వాలని హోమ్ మినిస్టర్ కోరామన్నారు.