ఆదివారం ఘట్కేసర్లో నిర్వహించిన రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడిపై స్పందిస్తూ.. ఆయనకు తగిన శాస్తే జరిగిందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అడ్డదిడ్డంగా మాట్లాడినందుకే ప్రజలు వ్యతిరేక నినాదాలు చేశారని, ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారని అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూముల్ని రాజ్యాంగబద్దంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ల్యాండ్ పూలింగ్ జీవో ఎందుకు రద్దు చేయడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
భూములు ఇవ్వడానికి రైతులెవరూ ముందుకు రావడం లేదని, సాయంత్రంలోపు ల్యాండ్ పూలింగ్ జీవో వెనక్కి తీసుకోకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని రాజేందర్ రెడ్డి అన్నారు. వీళ్ళు ఎమ్మెల్యేలు కాదని.. ల్యాండ్ బ్రోకర్లని విమర్శించారు. రైతుల పక్షాన పోరాటం చేస్తే.. మా నాయకుల్ని అరెస్ట్ చేస్తారా? అంటూ నాయిని నిలదీశారు. కాగా.. రెడ్ల సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో సభికుల నుంచి వ్యతిరేక నినాదాలు రేకెత్తాయి. దీంతో ఆయన ప్రసంగం ముగించుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలోనే నిరసనకారులు ఆయన కాన్వాయ్‌పై రాళ్ళు, కుర్చీలు, సీసాలతో దాడి చేశారు. పోలీసులు ఎంతో అప్రమత్తంతో మంత్రి వాహనాల్ని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చేశారు.
అటు, ఈ ఘటనపై స్పందిస్తూ తనను హత్య చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారంటూ మల్లారెడ్డి ఆరోపించారు. తనను ఎనిమిదేళ్లుగా బ్లాక్మెయిల్ చేస్తున్నారని, రేవంత్ రెడ్డి నేరాలపై విచారణ చేసి జైలులో పెడతామని అన్నారు. తనపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు రెడ్లకు అందుతున్నాయని తాను ఆ సభలో వివరించానని మల్లారెడ్డి అన్నారు.