Jammu kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో శుక్రవారం జరిగిన కాల్పుల్లో జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న పాకిస్తానీ ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. భద్రతా బలగాలకు ఇది కీలక విజయంగా భావిస్తు్న్నారు. కథువా జిల్లాలోని బిల్లావర్ జనరల్ ప్రాంతంలో ఆర్మీ, సీఆర్పీఎఫ్ కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఒక పాకిస్తానీ జైష్ ఉగ్రవాదిని మట్టుపెట్టినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు చెప్పారు.
Read Also: T20 World Cup: బంగ్లాదేశ్ దింపుడుకళ్లెం ఆశ.. ఐసీసీ ముందుకు చివరి డిమాండ్..
ఉగ్రవాదిని జైషే కమాండర్ ఉస్మాన్‌గా గుర్తించారు. పెద్ద ఎత్తున సంఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కిస్త్వార్ జిల్లాలో 12,000 అడుగులు ఎత్తులో ఉన్న ఉగ్రవాదులు దాగి ఉన్న స్థావరాలను భద్రతా బలగాలు ఛేదించిన కొన్ని రోజులకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ రహస్య స్థావరాలనికి అనేక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఒకేసారి నలుగురు ఉగ్రవాదులు ఇందులో ఉండగలరు. దీనిలో ఆహారం, వంట గ్యాస్, నెయ్యి, ధాన్యాలు, దుప్పట్ల వంటి అవసరమైన వస్తువులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో జైషే మహ్మద్ ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంతో ‘‘ఆపరేషన్ త్రాషి-1’’ను భద్రతా బలగాలు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో హవల్దార్ గజేంద్ర సింగ్ అనే సైనికుడు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు.