నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాదస్థలికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. దోమలపెంటలోని జె.పి గెస్ట్ హౌస్ లో ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖా సలహాదారు ఆదిత్య దాస్ నాధ్, ఐ.జి సత్యనారాయణ, అగ్నిమాపక డి.జి జి.వి నారాయణ రావు, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్ఎల్‌బిసి పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. జరిగిన సంఘటన పట్ల మంత్రులు ఉత్తమ్, జూపల్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే.. క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు ఆరా తీశారు.
Read Also: Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణ మా ధ్యేయం.. అమలు చేయాలని సీఎం చంద్రబాబుని కోరతాం..
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలంటూ అధికారులకు ఆదేశించారు. మరోవైపు.. సొరంగం లోపల చిక్కుకున్నారని భావిస్తున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. వైద్య ఆరోగ్య సిబ్బంది ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు సంఘటనా స్థలిలో ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Read Also: Hero Dhanush : ఆవిడ కాళ్లు పట్టుకున్న హీరో ధనుష్.. ఎంతైనా గ్రేట్ అంటూ కామెంట్స్
కాగా.. ఈరోజు ఉదయం శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 8:30 గంటల సమయంలో మూడుమీటర్ల మేర పైకప్పు కూలిపోయిన ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. టన్నెల్ పనులు జరగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ప్రాజెక్టు పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎడమవైపు సొరంగ పనులు జరుగుతుండగా, 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం సంభవించింది.