ఆర్టీసీ నష్టాల్లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టి కాపాడుకుంటోందని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి చెమట చుక్క విలువ తెలియని ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించదని అన్నారు. కేంద్రం మాత్రం ఉన్న సంస్థల్ని అమ్ముకుంటోందని.. కార్మికులకు లాభం చేకూర్చే 40 చట్టాలను తీసేసి కేవలం నాలుగు కార్మిక చట్టాలను తెచ్చారని విమర్శించారు. కార్మికుల హక్కులను హరించే ఈ నాలుగు చట్టాలను తీసేసే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం తొత్తుగా పని చేస్తుందని విమర్శించారు. లక్షల కోట్ల విలువ చేసే ఎయిర్ ఇండియాను వేల కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. ఇలా అన్ని సంస్థలను అమ్మితే పేదలకు నష్టం జరుగుతుందని ఆమె అన్నారు. అదానీకి అనుభవం లేకున్నా ప్రభుత్వ సంస్థలను ఆయనకు అమ్ముతున్నారని .. మోదీ తీరుతో అదాని దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేశారు. కార్మికుల హక్కు కోసం టీఆర్ఎస్ కొట్లాడుతుందని అన్నారు.
ఢిల్లీలో రైతులు చేసిన పోరాటాలను స్ఫూర్తి గా తీసుకొని కార్మికులు పోరాటం చెయ్యాలని అప్పుడే నల్ల చట్టాలు వెనుకకు తీసుకుంటారని కవిత అన్నారు. మోడీ ఐసీడీఎస్ నిధులను సగానికి తగ్గించారని విమర్శించారు. బీజేపీ ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట చెబుతోందని విమర్శలు గుప్పించారు. ఎన్నిక ముందు ఇచ్చిన రేషన్ కట్ చేశారని..మోడీది ఎన్నిక మోడ్..లేక పోతే ఏరో ప్లేన్ మోడ్ లో ఉంటారని అన్నారు. అయితే ఎన్నికల ప్రచారం లేక పోతే విదేశాల్లో పర్యటనకే మోడీ పరిమితం అయ్యారంటూ ఘాటు విమర్శలు చేశారు.