NTV Telugu Site icon

కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్….మోదీ సర్కార్ పై విమర్శలు

Kavita

Kavita

టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భనం ఇలా ప్రతీ అంశంపై ట్విట్టర్ వేదికపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర అవలంభిస్తున్న తీరుతో పాటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై కేటీఆర్ మోదీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్రంపై ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని విమర్శించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. డాలర్ తో పోలిస్తే అత్యంత గరిష్ట స్థాయికి రూపాయి మారకం విలువ చేరడంతో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తీవ్రస్థాయిలో నిరుద్యోగ రేటు పెరిగిందని… 7.83 శాతానికి నిరుద్యోగం చేరిందని విమర్శించారు. గ్యాస్ ధర వెయ్యికి చేరిందని… ఇదేనా మోదీ సర్కార్ మనకు చెప్పిన మంచి రోజులు అంటూ ట్వీట్ చేశారు.

ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలో అక్కడి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును కూడా ఎండగడుతోంది. రామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ వ్యవహారంపై కూడా టీఆర్ఎస్ పార్టీ ఘాటు విమర్శలు చేసింది. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు మతఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని ప్రశ్నించింది. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి చిల్లర, మతపరమైన రాజకీయాలు చేస్తుందని ఆరోపిస్తోంది. విభజన రాజకీయాలు తప్పితే బీజేపీ ప్రజలకు చేసిందేం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఈ విమర్శలపై బీజేపీ కూడా అంతే స్థాయిలో స్పందిస్తోంది. మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని…  ఎంఐఎం పార్టీతో చేరి వారు చెప్పినట్లు నడుచుకుంటోందని విమర్శలు చేస్తున్నారు.