ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కొనసాగుతోన్న కాంగ్రెస్ పార్టీ ధరణి రచ్చబండ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూముల విలువ పెంపకం పేరుతో దందాలు జరుగుతున్నాయని చెప్పిన ఆమె.. దున్నేవాడికి కేసీఆర్ భూమి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం అడ్డగోలుగా భూముల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎక్కడ భూములున్నా లాక్కుంటున్నారని విమర్శించారు. అటు.. ఫారెస్ట్ అధికారులు కూడా భూములు లాక్కుంటూ, పోడు రైతులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ కారణంగా మహబూబాబాద్ జిల్లా నారాయణపూర్‌లో 18 వందల ఎకరాలు ఆగమయ్యాయమని సీతక్క పేర్కొన్నారు. భూమి అంటే తరతరాలుగా వచ్చే ఆధారమని, అలాంటి ఆధారాన్ని కేసీఆర్ దూరం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ భూములు పంచితే.. కేసీఆర్ వాటిని గుంజుకొని, ప్రైవేట్ కంపెనీలకు పంచి పెడుతున్నారని ధ్వజమెత్తారు. అడువులున్న చోటే మళ్లీ అడువుల పెంపకం చేపడుతున్నారని.. భూ సమస్యలతో చాలామంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటివరకు ఖాళీగా వున్న ప్రభుత్వ స్థలం.. ఇప్పుడు టీఆర్ఎస్ నేతల పేర్లకు మారుతున్నాయని సీతక్క ఆగ్రహించారు.