నేటి సమాజంలో రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగినా, ఎలాంటి సంఘటన జరిగినా మనకేందుకులే అనుకుంటారు. కానీ.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే రేఖా నాయక్ రోడ్డు ప్రమాద బాధితుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించారు. కడెం పర్యటన ముగించుకుని ఎమ్మెల్యే రేఖా నాయక్ నిర్మల్ వెళ్తుండగా, ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామ శివార్లలో ఓ కారు చెట్టుకు ఢీకొని ప్రమాదానికి గురైంది.
ఇది గమనించిన ఎమ్మెల్యే రేఖా నాయక్ వెంటనే తన వాహనాన్ని ఆపించి, వాహనం దిగి పరిస్థితిని సమీక్షించారు. అంతేకాకుండా.. ప్రమాదంలో ఆ కారులోని వారు తీవ్ర గాయాలపాలైన విషయాన్ని గుర్తించి ఆమె వెంటనే స్పందించారు. తన సిబ్బంది సాయంతో వారిని తన కారులోకి చేర్చి.. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించి.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.