MLA Raghunandan Rao Fires On CM KCR: అసెంబ్లీని సీఎం కేసీఆర్ తన రాజకీయానికి వేదికగా మార్చుకున్నారని.. ఇది దురదృష్టకరమని ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలని భావిస్తున్న కేసీఆర్.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడారని అన్నారు. పరోక్ష మిత్రుడు కాంగ్రెస్, ప్రత్యక్ష మిత్రుడు ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు కూడబలికి.. వాళ్లకు వాళ్లే అసెంబ్లీలో మాట్లాడారని వాపోయారు. విద్యుత్ విషయంలో కేంద్రంపై మాట్లాడిన భట్టి విక్రమార్క.. రాష్ట్రం విషయం గురించి మాట్లాడలేదన్నారు. 2020లో విద్యుత్తు సంస్కరణ బిల్లు తెచ్చి, 2022లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. అసలు పాస్ కాని బిల్లు కోసం అసెంబ్లీలో చర్చించారన్నారు.
‘‘జాతీయ పార్టీ పెట్టొద్దని ఎవరన్నారు? బీఆర్ఎస్ పెట్టుకోండి, వీఆర్ఎస్ తీసుకోండి, ఫాంహౌస్‌కు పరిమితం అవ్వండి.. మాకేం అభ్యంతరం లేదు’’ అని రఘునందన్ రావు మండిపడ్డారు. మూడు తోకలు ఎలా అధికారంలోకి వస్తాయని ప్రశ్నించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ప్రతి పక్షాలను గౌరవించటం నేర్చుకోవాల్సింది మీరేనని హితవు పలికారు. తమకు రేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అప్పుడు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని విద్యుత్ బిల్లులో ఎక్కడా పేర్కొనబడలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌గానే ఈరోజు, రేపు అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఖరారు చేశారన్నారు. సభలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని అభిప్రాయపడ్డారు.