Ministers on Governor: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్ల పదవీ కాలాన్ని ముగించుకున్న నేపథ్యంలో గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రులు గవర్నర్‌పై మండిపడ్డారు.
ముఖ్యమంత్రిపై, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్‌కు ఫ్యాషన్‌గా మారిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇది సరైనది కాదన్న ఆయన.. నిత్యం వార్తల్లో ఉండేందుకే గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజ్‌భవన్‌ను ఉపయోగించుకుని గవర్నర్ బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించడంలో కేసీఆర్ వంటి పరిణతి చెందిన నాయకుడు మరొకరు లేరన్నారు. గౌరవంగా రాజ్‌భవన్‌ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేశంలో ప్రధాని, రాష్టపతి తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలన సాగుతుందన్నారు.
మరోవైరు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గవర్నర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై హూందా తనాన్ని కోల్పోతున్నారని ఆయన అన్నారు. గౌరవనీయమైన గవర్నర్ వ్యవస్థను చెడగొడుతున్నారని ఆయన అన్నారు. గవర్నర్‌గా ఆమె చేష్టలు ప్రజలను బాధపెడుతున్నాయన్నారు. తమిళిసై రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ, బీజేపీ నాయకులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తుండటం వల్లనే తమిళిసైకి తగిన గౌరవం దక్కడం లేదన్నారు. గవర్నర్ తమిళిసైని తెలంగాణ ఆడపడుచులా చూసుకున్నామన్నారు. కానీ ఆమె బీజేపీ డైరెక్షన్‌లో పని చేస్తున్నారని మండిపడ్డారు.
MLC Kalvakuntla Kavitha: రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు..
సమస్యలపై ఆదేశాలు ఇవ్వాల్సిన గవర్నర్ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని కించపరుస్తూ తిరగడం దేనికని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. మేడారం వచ్చే సమాచారం స్థానిక మంత్రులుగా కనీసం మాకు ఇవ్వలేదని ఈ సందర్భంగా వెల్లడించారు.రాష్ట్రంలో పర్యటిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటేసుకు తిరగడం దేనికి సంకేతమన్నారు. ప్రభుత్వ వైద్యశాలలపై గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు తెలంగాణలో ఇస్తున్నంత మెరుగైన వైద్యం దేశంలో ఎక్కడా లేదన్నారు. గవర్నర్ తమిళిసై తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తున్నారని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. ప్రజలకు తప్పుడు సంకేతాలిచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇచ్చేది లేదు పుచ్చుకునేది లేదు ప్రధాని సమావేశాలకు గవర్నర్ ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. దయచేసి మీరు హూందాగా ప్రవర్తించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గవర్నర్ పదవికి వన్నె తెచ్చేలా ప్రవర్తించాలని చేతులెత్తి మొక్కుతున్నామన్నారు.