Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీజేపీ చేస్తున్న విమర్శలు నిరాధారమని, “ఎరువులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయనే విషయం కూడా రామచంద్రరావుకి తెలియదా?” అంటూ మండిపడ్డారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు, ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో కూడా రామచంద్రరావుకి అర్థం కావడం లేదు. మిగతా విత్తనాలు, నీళ్లు, విద్యుత్ వంటి సదుపాయాలను రాష్ట్రాలు అందిస్తున్నాయి కానీ ఎరువుల తయారీ, సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది” అని స్పష్టం చేశారు.
“కేంద్రం సరైన విధంగా ఎరువులు సరఫరా చేయడంలో విఫలమవుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడం ఎందుకు?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా.. “బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ రైతుల సమస్యలను అర్థం చేసుకోవడం లేదు. ఢిల్లీకి వెళ్లి మీ ప్రధానమంత్రిని కలిసి తెలంగాణకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించండి. రైతుల సమస్యలపై రాజకీయాలు చేయడం మానేయాలి” అని హెచ్చరించారు.
Bangladesh: యూనస్ షేక్ హసీనాకు భయపడుతున్నారా..?
రైతుల అవసరాల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని గుర్తు చేస్తూ, “ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత మంత్రులను కలిసి ఎరువుల సరఫరా కోసం విజ్ఞప్తి చేశారు. కానీ బీజేపీ నాయకులు ఈ విషయం మీద మౌనం వహిస్తున్నారు” అని ఆరోపించారు.
“దేశంలో 29 రాష్ట్రాల మధ్య తెలంగాణ పట్ల కేంద్రం ఎంత వివక్షత చూపుతోందో ప్రజలు గుర్తించాలి. బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఒత్తిడి చేసి తెలంగాణ రైతులకు కావాల్సిన ఎరువులు తీసుకురావాలి” అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులను దాచిపెడుతోందని చెప్పడం పూర్తిగా అబద్ధమని ఆయన ఖండించారు. “ఎరువులు ఎంత స్టాక్‌లో ఉన్నాయి, ఎంత సరఫరా కావాల్సి ఉంది అనే వివరాలు సేకరించి, ఢిల్లీకి వెళ్లి రామచంద్రరావు మాట్లాడాలి” అని సవాలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ, “రైతులు, పల్లెలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల సమస్యలను అర్థం చేసుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. కేంద్రం సరైన విధంగా ఎరువులు పంపకపోవడం వల్లే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం” అని అన్నారు.