కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. తెలంగాణలో నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న అలర్లు దానికి నిదర్శనం. అయితే అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలంటూ విమర్శలు వెల్లువెత్తుతుంటే.. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌ఫోర్స్ లాంటి విభాగాల్లో అగ్నివీరులకు ప్రత్యేక కేటాయింపు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెస్తామన్నారు.. జన్ ధన్ ఖాతాలు తెరవండి.. 15 లక్షలు వేస్తామని మాట తప్పారు అంటూ ఆయన విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మకండని ప్రజలను ఆయన కోరారు. కాలం చెల్లిన మందు లాంటిది కాంగ్రెస్ అని ఆయన విమర్శలు చేశారు. తెలంగాణను ఉద్దరిస్తామంటే ఎట్లనమ్మాలని, ఒక్క ఛాన్స్ ఇవ్వండని రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ కాదు 10 ఛాన్సులిచ్చినం.. 5 తరాలు ,5 దశాబ్దాలు అవకాశమిచ్చినమని ఆయన వ్యాఖ్యానించారు. 50 ఏళ్లు ఛాన్సులిస్తే .. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. హంతకుడే సంతాపం ప్రకటించినట్లుంది అంటూ ఆయన మండిపడ్డారు.