కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం నల్లడబ్బు వెలికి తీయడం కాదు.. ప్రజల జేబులకు చిల్లులు పెడుతుందన్నారు. బీజేపీ ఏలుబడిలో అదానీలు, అంబానీలు పెరుగుతున్నారన్నారు. పేదలు మాత్రం మరింత పేదలుగా మారుతున్నారన్నారు.
Read Also: కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దొంగ చాటున రైతు చట్టాలను అమలు చేసేందుకు మోడీ సర్కార్ కుట్రలకు తెరతీసిందని ఆరోపించారు. ఇక్కడి బీజేపీ నేతలు ఊరకుక్కల్లా మొరుగుతున్నారు. వారికి మోడీనే శిక్షణ ఇచ్చి ఉంటారని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. బీజేపీ పాలనలో కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను తమ తాబేదార్లకు అంట గడుతుందని మోడీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి కేంద్ర ప్రభుత్వంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. పెరిగిన ఎరువులు, డీజీల్, పెట్రోల్ ధరలపై ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.