Minister Jagadish Reddy: ప్రధాని మోడీ తల్లి పాల మీద తప్ప అన్నింటిపై పన్నులు వేశారని.. మోడీ పనుల ప్రధాని కాదు పన్నుల ప్రధాని అని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి ధ్వజమెత్తారు. 2018 తర్వాత మునుగోడులో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి అన్నారు. ఆ ఎమ్మెల్యే ఆరు నెలలకు కూడా ఒక్కసారి మునుగోడుకు వచ్చింది లేదని చెప్పారు. ఉమ్మడి నల్గొండ నుంచి ఫ్లోరోసిస్‌ను కేసీఆర్ తరిమి వేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో దిక్కు లేదు, తెలంగాణలో దిక్కు లేదు.. ఇక మునుగోడులో కాంగ్రెస్ సంగతి మీకు బాగా తెలుసని ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మునుగోడుపై కేసీఆర్‌కు ప్రత్యేక దృష్టి ఉందని.. సమస్యలను పరిష్కరించుకుందామని సూచించారు.
Ramachandru Tejavath: కేసీఆర్ నా సలహాలను పట్టించుకోలేదు.. అందుకే రాజీనామా చేశా..
కాంట్రాక్టులు, వ్యాపారాల్లో బిజీగా ఉండడం వల్ల ఆ ఎమ్మెల్యేకు కల్యాణలక్ష్మీ చెక్కులు ఇచ్చే తీరిక లేదని.. రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి ఎద్దేవా చేశారు. అందుకే తానే మునుగోడుకు రావాల్సి వచ్చిందని.. కల్యాణ లక్ష్మీ చెక్కులు పంచాల్సి వచ్చిందన్నారు. నోరు ఇంత పెద్దగా చేసుకుని.. నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతూ ప్రజలను ఆ ఎమ్మెల్యే మోసం చేస్తున్నాడని ఆరోపించారు. మునుగోడులో అంతర్గత పొరపాట్ల వల్ల ఆ నియోజకవర్గాన్ని పోగొట్టుకున్నామన్నారు. ఉన్న పార్టీ నాయకులనే దూషించి.. అవతలి పార్టీని పొగిడే ఆ ఎమ్మెల్యే దగ్గర పనిచేయాలేకనే టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.