ఈటల రాజేందర్ చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్స్ లో టీఆర్ఎస్‌లో పలువురు ఇతర పార్టీలకు చెందినవారు చేరారు.. వారికి పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన హరీష్‌రావు.. దళిత బంధు రాదంటూ ఈటల దళితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.. ఈటల చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దని సూచించిన ఆయన.. ప్రతి దళిత కుటుంభానికి రూ.9లక్షల 90వేలు వస్తున్నట్లు టంగు టంగు మంటు మెసేజ్‌లు వస్తున్నాయన్నారు. వైన్స్, కాంట్రాక్ట్, ఫర్టిలైజర్, ఇలా అనేక ప్రైవేట్ సంస్థల్లో దళితులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపిన హరీష్‌రావు.. హుజురాబాద్ దళిత బంధు విజయం రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం కావాలన్నారు. దళిత బంధుకు పైసలు ఎక్కడివి అని ఈటల అన్నారు.. మరి ఇప్పుడు అందరికి దళిత బంధు వస్తుంది.. దీనికి ఈటల ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. ఇక, మన మీద కుట్రలు పన్నుతున్న చీడ పురుగులను ఏరి వేయాల్సిన అవసరం ఉందని సూచించారు మంత్రి హరీష్‌రావు.