Telangana Health Minister Harish Rao Fired on BJP and Congress Leaders.
సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్‌పల్లి గ్రామంలో రైతు వేదిక, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్‌రావు శంకుస్ధాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15కోట్లతో 18కిమీ మేర ఈ గ్రామం మీదుగా డబుల్ లైన్ రోడ్ పనులకు శంఖు స్థాపన చేశామని ఆయన అన్నారు. మండే ఎండ కాలంలో కూడా కాళేశ్వరం నీళ్లతో చెరువులు మత్తల్లు దుంకుతున్నాయని, కాంగ్రెస్ హయాంలో రైతులు ఒక మడి ఎండకుండ పంట పండించలేదన్నారు. గతంలో కలిపోయే మోటార్లు , పేలే ట్రాన్స్ ఫార్మర్ లు ఉండేవని ఆయన మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కండ్లు ఉండి చూడలేని కబోధిలు అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర రైతులు తెలంగాణ బార్డర్‌లో భూమి కోని అక్కడ బోరు వేసి ఆ బోరు ద్వారా నీళ్లను అక్కడ పొలానికి తీసుకెళుతున్నారని, ఫేక్ వాట్సప్ యూనివర్సిటీతో బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు.
స్వంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి 3లక్షలు ఇస్తామని, వడ్లు కొనమని మోడీ ప్రభుత్వం మొండికేస్తుందని, పంజాబ్ వడ్లు కోని తెలంగాణ వడ్లు ఎందుకు కొనదని ఆయన ప్రశ్నించారు. మద్దతు ధర వడ్లకు ఇచ్చి వడ్లు కొనకుండా బియ్యం కొంటామంటున్నారని, కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపిస్తం, తొందరపడి ఎవరు భూములు అమ్ముకోవద్దు భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. వెయ్యి పడకల ఆసుపత్రి ఈ గ్రామ శివారులో రాబోతుంది, వంద కోట్లతో పామాయిల్ ఫాక్టరీ నిర్మిస్తున్నాం, అందరూ పామాయిల్ పంటలు వేయాలన్నారు. త్వరలో అభయ హస్తం డబ్బులను మిత్తితో సహా చెల్లిస్తాం,అతి త్వరలోనే అర్హులైన వారికి కొత్త పెన్షన్ లు మంజూరు చేస్తామన్నారు.