సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో, సుడా మాస్టర్ ప్లాన్ సమీక్ష సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణ భవిష్యత్ ప్రణాళిక కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. 2041వ సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని 20 సంవత్సరాల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. గతంలో 3.15 చదరపు కిలోమీటర్లు ఉన్న సుడా పరిధి నేడు 310 చదరపు కిలోమీటర్లకు విస్తరించబోతున్నామని ఆయన వెల్లడించారు. సమగ్రమైన ప్రణాళిక ఉంటేనే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావని ఆయన తెలిపారు. లవబుల్ సిటీ.. లీవెబుల్ సిటీ కోసం మాస్టర్ ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్, మెడికల్ కాలేజీ, ఇండస్ట్రియల్ జోన్, రింగ్ రోడ్ లను దృష్టిలో ఉంచుకొని ప్లాన్ తయారు చేయాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు.