కేంద్ర ప్రభుత్వ, బీజేపీ వైఖరి మారుతుందని వారం రోజుల నుంచి ఆశపడ్డాం అయినా.. వారిలో మార్పు లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయమని కేంద్రం తెలిపిందన్నారు. దీంతో వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే.. రాష్ట్రం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు. పీయూష్ గోయల్‌ను కలిసిన సమయంలో రిక్వెస్ట్ చేస్తే ఆయన పట్టించుకోలేదని… లిఖిత పూర్వకంగా ఎలాంటి సమాచారం రాలేదని ఆయన అన్నారు. తెలంగాణలో ఎఫ్ సీఐ గోదాంలు నిండిపోయామని.. వాటిని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని పంపించలేదనే కేంద్రం వాదన సరికాదని ఆయన అన్నారు. తెలంగాణలో గోదాంలు నిండిపోవడంతో.. బీదర్, జగ్గయ్య పేటలోని గోదాంలను కేటాయించాలని గతంలో ఏడు సార్లు లేఖలు రాశామని వాటిపై కేంద్రం నుంచి స్పందన లేదని అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్రానికి ఇష్టం లేదని అన్నారు. కిషన్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి ఉన్న సమస్యలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రైతులపై పక్షపాతి ధోరణి తో వ్యవహరించడం సరికాదని గంగుల అన్నారు. ఇప్పటికైనా కేంద్రం మరోసారి ఈ అంశంపై పునరాలోచించుకోవాలని మంత్రి అన్నారు.