MLC Election: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో తెలంగాణలో ఎన్నికల హడావుడి ప్రారంభం అయింది. తెలంగాణలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాబోతున్నాయి. ముఖ్యం హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై మజ్లిస్ పార్టీ నజర్ పెట్టింది. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎంఐఎం పార్టీకి చెందిన సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఉన్నారు. మే 1తో గడువు ముగుస్తోంది. అయితే మరోసారి ఈ స్థానంలో ఎంఐఎం పాగా వేయాలని అనుకుంటోంది. దీని కోసం బీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది.
Read Also: Tummala Nageswara Rao: ఇచ్చిన మాట కోసం పెద్ద పాలేరుగా పనిచేశా.. మరో అవకాశం ఇవ్వాలి..
ఇప్పటికే ఎంఐఎం పార్టీ ముఖ్యనేతలు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ నేతలతో వరసగా భేటీ అవుతున్నారు. ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల పాతబస్తీ పర్యటన సమయంలో అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. తాజాగా అసద్ ఈ రోజు కేటీఆర్ తో సమావేశం అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మద్దుతు ఇస్తుందా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి కూడా కార్పొరేటర్లు ఉండటంతో ఆ పార్టీ కూడా అభ్యర్థిని పెట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ మద్దతు పీఆర్టీయూ కా..? కమ్యూనిస్ట్ పార్టీకా..? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల అయింది. ఏపీలో 13, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఫిబ్రవరి 27. మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ ఉండనుంది.