Mamunur Airport: వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్ కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అలాగే, తమ భూములకు న్యాయపరమైన పరిహారాన్ని చెల్లించాలని ఆందోళనకు దిగారు. దీంతో పాటు నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని గుంటూరు పల్లి రైతుల డిమాండ్ చేశారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొన్నారు. ఇక, సర్వే కోసం వచ్చిన ఆర్డీవోను అడ్డుకుని ఇప్పుడు సర్వే చేయొద్దని గుంటూరు పల్లి వసూలు కోరారు. అయితే, నిరసన జరిగే ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఇక, ఎయిర్‌పోర్టును తామేమి వ్యతిరేకించడం లేదని రైతులు తెలిపారు. ఇక్కడ విమానాశ్రయం రావడం సంతోషమే.. ఎయిర్‌పోర్టు రావడం వల్ల ఎంత లాభపడుతున్నామో.. అంతకంటే ఎక్కువ నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాకపోవడంతో ఆందోళనకు దిగినట్లు రైతన్నలు చెబుతున్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారమే భూమికి నష్టపరిహారం ఇస్తామని లేదా రైతులు కోరుకున్న చోటే వ్యవసాయ ఆమోద యోగ్యమైన భూములు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది.. కానీ, ఇప్పుడు భూములకు భూమి ఇవ్వకపోవడమే కాకుండా.. తమ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని కూడా క్లోజ్ చేస్తున్నారని రైతులు మండిపడ్డారు.