హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేడి మళ్లీ కోకాపేట వైపు మరింతగా మళ్లింది. నియోపోలిస్ లేఅవుట్ పరిసరాల్లో HMDA నిర్వహించిన తాజా భూముల వేలంలో ధరలు అన్ని రికార్డులను చెరిపేస్తూ ఎకరానికి రూ.137.25 కోట్లు చేరాయి. ప్లాట్ నంబర్లు 17, 18లకు భారీ పోటీ నెలకొనగా, ప్లాట్ నం.17లో ఉన్న 4.59 ఎకరాలు ఎకరానికి రూ.136.50 కోట్లకు, ప్లాట్ నం.18లోని 5.31 ఎకరాలు ఎకరానికి రూ.137.25 కోట్లకు హామర్ కొట్టాయి. మొత్తం 9.90 ఎకరాలపై HMDAకి రూ.1,355.33 కోట్ల భారీ ఆదాయం లభించింది. ఈ నేపథ్యంలో కోకాపేటలో మిగిలిన భూములను నవంబర్ 28న మరొక విడత వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ప్రాంతంపై రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎందుకు ఇంత ఆసక్తి చూపుతున్నాయంటే, నియోపోలిస్ లేఅవుట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అందుబాటులో ఉండటం ప్రధాన కారణాలు. ముఖ్యంగా, ఇక్కడ భవనాల ఎత్తుపై ఎలాంటి పరిమితులు లేకపోవడం వల్ల భారీ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించుకునే వీలుంది. అదనంగా, కోకాపేటకు ORR సమీపం కావడం, రాయదుర్గం IT హబ్‌కు అత్యంత దగ్గరగా ఉండటం కూడా రియల్ ఎస్టేట్ విలువలను మరింత పెంచుతోంది. ఈ అంశాలన్నీ కలిసి కోకాపేట భూముల ధరలను ఆకాశాన్నంటేలా చేస్తున్నాయి. అంతేకాకుండా.. గతంలో కూడా నియోపోలీస్ లేఅవుట్ లో 10వ నెంబర్ ప్లాట్ అత్యధికంగా రూ.100.75 కోట్ల ధర పలికింది.