kishan reddy: ఎన్నికల ప్రచారంలో బీజేపీకి దేశ వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించామని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధానితో ఐదు సభలను నిర్వహించామన్నారు. విజయ సంకల్ప సభకు మంచి స్పందన వచ్చిందన్నారు. బీజేపీకి, మోదీకి ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీన పడిందన్నారు. ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారడంతో ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. కేసీఆర్ లోను నేతలు వెళ్లిపోతున్నారనే బాధ కనిపిస్తోందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ ఓడిపోయాం అనుకోవడం లేదని.. ఫోన్ ట్యాపింగ్, కూతురి బీర్ బ్రాండ్ స్కామ్ లతో మధ్యలో బీజేపీని విమర్శిస్తున్నారన్నారు. “జై శ్రీరాం” అంటే మీకు ఉద్యోగాలు
ఇస్తాయా? ఆ నినాదం అన్నం పెడుతుందా? అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ ను బీజేపీ జెండా పట్టుకున్న అభ్యర్థి కామారెడ్డిలో తొక్కారన్నారు. ఏ మొహం పెట్టుకుని ఎంపీ ఎన్నికలకు ఓటు అడుగుతున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు. డిపాజిట్లు తెచ్చుకోవడం కోసం బీఆర్ఎస్ పోటీ చేయాలని విమర్శించారు. డిపాజిట్లు వచ్చేలా కేసీఆర్ పర్యటనలు చేయాలన్నారు.
ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ రాజ్యం, రాహుల్ గాంధీ రాజ్యం వస్తుందని అనేక పేర్లతో కాంగ్రెస్ గారడీ చేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. నిన్న ఓ సభలో సీఎం రేవంత్ గ్యారంటీల అమలు విషయంలో అబద్ధాలు ఆడారని ఆరోపించారు. ఇదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసీ.. హామీల అమలుకు ఎలక్షన్ కోడ్ ఉందని రేవంత్ చెబుతున్నారని చెప్పారు. ఇప్పుడు ఆగస్ట్ 15 వరకు హామీల అమలు చేస్తామంటున్నారన్నారు. జూన్ 4 తరువాత లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెట్టి మళ్లీ హామీల అంశాలను దాటవేస్తారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి.. దగా చేస్తున్న వారికి ఓట్లు అడిగే హక్కు ఉందా? అని ప్రశ్నించారు.
సోనియమ్మ తల్లి అని చెప్పి రాయించిన ఉత్తరం ఏమయ్యింది? అని ప్రశ్నించారు. ఇవి గ్యారంటీలా.? మోసాలా.? రేవంత్ చెప్పాలన్నారు. ఎందుకు వాటి అమలుపై మౌనంగా ఉన్నారు? అని అడిగారు. వంద రోజుల్లో ప్రతి గ్యారంటీ నెరవేరుతుందన్న మాట ఏమైందని ప్రశ్నించారు. హామీలు అమలు చేసే వరకు తెలంగాణ ప్రజలు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. తెలంగాణను ఇచ్చిన తరువాత కాంగ్రెస్ ఏ ఒక్కరోజు బాధ్యతగా వ్యవహరించలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి పంపారని.. ఇప్పుడు బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతోందని ఆరోపించారు. ఎవరు ఎవరికి బీ టీం అనేది చెప్పాలన్నారు. బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కూతురికి బెయిల్ కోసం బీజేపీతో 5 సీట్లకు సుపారీ తీసుకున్నారని చేసిన ఆరోపణలను కొట్టేశారు. లిక్కర్ స్కాం అనేది లోక్ సభ ఎన్నికలకు.. తెలంగాణకు సంబంధం లేని అంశమని స్పష్టం చేశారు. లిక్కర్ స్కాం లో దిల్లీ ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారు.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ అంటే కరప్ట్, కాంగ్రెస్ DNAలోనే అవినీతి ఉందన్నారు. కాంగ్రెస్ కి అరవై ఏళ్లు అధికారం ఇస్తే దేశాన్ని దోపిడీ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు తేడా లేదన్నారు. కాంగ్రెస్ బడే భాయ్.. బీఆర్ఎస్ చోటే భాయ్ అన్నారు. కేసీఆర్ వి కాంగ్రెస్ మూలాలేనని విమర్శించారు. ఇద్దరివి ఫ్యామిలీ పాలిటిక్స్.. ఒకటి సోనియమ్మ ఫ్యామిలీ.. మరొక్కటి కేసీఆర్ ఫ్యామిలీ అన్నారు.