తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుoబoపై వ్యతిరేకత కనిపిస్తోందని, అధికార మంత్రులు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి అందుకే బీజేపీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యం కలిగిన వారు.. కేసీఆర్ లా ఫామ్ హౌస్ లో పడుకోవడానికి ప్రదానీ మోడీ రాష్ట్రానికి రావడం లేదని ఆయన అన్నారు. వేల కోట్లు తెలంగాణ ప్రజా సంపద దోచుకున్న కేసీఆర్ కుటుoబానికి మోడీని విమర్శించే నైతిక హక్కు లేదని, మోడీ అనేక అభివృద్ధి పనులకోసం రాష్ట్రానికి వస్తుంటే కేసీఆర్ కు రావడానికి సమయం ఉండదన్నారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా.. ఇంతకన్న దరిద్రమైన ముఖ్యమంత్రి దేశంలో ఎవరుండరని, ఫామ్ హౌస్ లో కూర్చోవడానికి సమయం ఉంటది.. మోడీ రాష్ట్రానికి వస్తే కలవడానికి సమయముండదా కేసీఆర్ అని ఆయన ప్రశ్నించారు. తొంభై రోజుల సమయం ఉంది ప్రజలు ఆలోచించాలి.. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలన్నారు. కేసీఆర్ హాటావో, తెలంగాణ బచావో అని ప్రజలు నినదిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తెచ్చిన పథకాల్ని పూర్తిగా వైఫల్యం చెందాయని, విద్య, వైద్యం పూర్తిగా కుంటు పడిందన్నారు. ఆర్థిక వ్యవస్థ విఫలం అయ్యిందని, ఎనభై వేల పుస్తకాలు చదివినా కేసీఆర్ తెలివి ఎక్కడ బోయిందన్నారు. ఎనభై వేల పుస్తకాలు చదివినా తెలివితో కేసీఆర్ తెలంగాణను పూర్తిగా దోపిడీకి గురి చేశాడని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఅర్ఎస్ కు ఓటేసినట్టేనని, ఎలాగో గెలవరు కాబట్టి ఇష్టమొచ్చిన హామీలు ఇస్తుంది కాంగ్రెస్ అని ఆయన ధ్వజమెత్తారు.
ఆరు గ్యారెంటీలు కాదు అరవై గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాలేదని, కాంగ్రెస్ చరిత్ర దేశ ప్రజలకు తెలుసు అని ఆయన అన్నారు. అరవై యేండ్లు దేశాన్ని పాలించారు.. అడుగడుగున అవినీతితో దోచుకున్న కాంగ్రెస్ చరిత్ర ప్రజలకు తెలుసు అని, ప్రజలు ఆలోచించాలన్నారు. రేపు మోడీ పాలమూరు గడ్డపై అడుగు పెడుతున్నారని, ఘనంగా స్వాగతం పలకాలని ప్రజలను కోరుకుంటున్నారని, గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. గంట సేపు మీమీ పరిసరాల్లో శ్రమ దానం చేయాలని కోరుతున్నానని, మోడీ తెలంగాణ ప్రజలకు కానుకలు ఇవ్వబోతున్నారని ఆయన వెల్లడించారు.