KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సతీమణి మాగంటి సునీత పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో, బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కలిసి మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కొత్తగా పార్టీలో చేరికలు, ప్రచార వ్యూహం తదితర అంశాలను ఇద్దరూ కేసీఆర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల గడువు దగ్గరపడుతున్నందున ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయాలని సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నందున, ఆ ప్రభావం ఉప ఎన్నిక ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై ప్రచారం, పోలింగ్ రోజు వ్యూహం, బూత్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై ముఖ్య నేతలకు కేసీఆర్ స్వయంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం ఎర్రవల్లి నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.