KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ లంచ్ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. అసెంబ్లీతో పాటు శాసనమండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు లేవనెత్తాల్సిన అంశాలు, ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించే విధానం, ప్రభుత్వ నిర్ణయాలపై స్పందించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తైన నేపథ్యంలో జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ వ్యూహం ఎలా ఉండాలనే దానిపైనా కూడా చర్చించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ, మండలిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమన్వయంతో వ్యవహరించేలా కేసీఆర్ పలు సూచనలు, ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో నేటి బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

