Karnataka CM Basavaraj Bommai Fires On Telangana Govt For Flexis: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. ‘40 శాతం ప్రభుత్వానికి సుస్వాగతం’ అంటూ తన గురించి హైదరాబాద్‌లో వేసిన ఫ్లెక్సీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై విచ్చేసిన విషయం తెలిసిందే! ఆయన నగరానికి వస్తున్నారని తెలిసి.. ‘40 శాతం ప్రభుత్వానికి సుస్వాగతం’ అనే ఫ్లెక్సీలు వెలుగు చూశాయి. అవి చూసి కోపాద్రిక్తుడైన ఆయన.. ఇలాంటి సంఘటనల కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఉండే సంబంధాలు అస్తవ్యస్తంగా మారుతాయని హెచ్చరించారు.
తెలంగాణలో జరుగుతోన్న అవినీతి గురించి కర్ణాటకలో ప్రస్తావిస్తే ఎలా ఉంటుంది? అని సీఎం కేసీఆర్‌కు బసవరాజు బొమ్మై ప్రశ్నించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, వాటి వల్ల రెండు రాష్ట్రాల మధ్య ఉండే రాజకీయ సంబంధాలు పూర్తిగా నాశనం అవుతాయని అన్నారు. ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకూడదని హితవు పలికారు. ఒక రాష్ట్రంపై ఆధారరహిత ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై తాము కర్ణాటకలో ఫ్లెక్సీలు వేయిస్తే ఎలా ఉంటుందని నిలదీశారు. ఇంతకీ.. ‘40 శాతం ప్రభుత్వానికి స్వాగతం’ అనే ట్యాగ్ లైన్ వెనుకున్న కథేమిటి? అని ఆలోచిస్తున్నారా? కర్ణాటకలోని మంత్రులు, అన్ని పనుల్లోనూ 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ వాళ్లు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఆ విషయాన్నే షార్ట్ కట్‌లో అలా ప్రస్తావిస్తూ.. ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.