Ponnam Prabhakar: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అర్బన్ తహసిల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లయ్, వరి ధాన్యం కొనుగోలుపై మంత్రులు, సీఎస్, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుకి సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లు, దొడ్డు వడ్లు కొనుగోలు చేస్తుంది అన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎస్ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని పేర్కొన్నారు.
అయితే, అధిక తూకం లేకుండా, ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు రాకుండా.. చర్యలు తీసుకోవడంతో పాటు పేమెంట్ ఆలస్యం కాకుండా వెంట వెంటనే రైతుల ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులకు ఏమైనా ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయండి అని సూచించారు. కానీ, రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దు అని కోరారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.. పంట ఎండి పోయిందనే అవకాశం లేకుండా విద్యుత్ ఇబ్బందులు లేకుండా, నీటిని వాడుకుంటూ పంటలు కాపాడుకున్నాం అన్నారు. ఎందుకంటే, మాది రైతుల ప్రభుత్వం అని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.