ఓ సర్వేయర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన జోగులంబ గద్వాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని కెటిదొడ్డి మండలం ఇర్లబండ గ్రామ శివారులో గద్వాల పట్టణానికి చెందిన వెలుగు రమణకు 7 ఎకరాల పొలం ఉంది. జీవన ఉపాధి నిమిత్తం అమనగల్ ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే తన భూమి కజ్జాకు గురవుతుందంటూ వెంటనే సర్వే చేయాలని పలుసార్లు జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఆపై కెటిదొడ్డి మండలానికి చెందిన సర్వేయర్ తిక్కన్నను ఆశ్రయించాడు. అయితే, 20 వేల రూపాయలు ఇవ్వాలని సర్వేయర్ డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వగా, తన ఇంటిలో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. 20 వేల లంచం తీసుకున్నందుకు గాను రేపు నాంపల్లి కోర్టులో సరెండర్ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.