Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రాజెక్టుల క్రెడిట్ , నీటి కేటాయింపులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హరీష్ రావు తీరును , బీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.
హరీష్ రావు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తుంటే, అన్నీ తనకే తెలుసు అన్నట్లుగా, ప్రపంచంలో వేరే ఎవరికీ ఏమీ తెలియదు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారని జగ్గారెడ్డి విమర్శించారు. ఆ ప్రజెంటేషన్ వినేటప్పుడు ఆయన ముందు కూర్చున్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ముఖాల్లో అసహనం కనిపించిందని, కానీ పార్టీలో ఉండాలి కాబట్టి తప్పక వింటున్నట్లుగా తనకు అనిపించిందని ఆయన ఎద్దేవా చేశారు.
Nandyal: చాగలమర్రి మండలం మద్దూరులోని.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీలో వీడిన మిస్టరీ..
తెలంగాణలో నీటి సమస్యను కేవలం కేసీఆర్ , హరీష్ రావు మాత్రమే పరిష్కరించారనే ప్రచారాన్ని జగ్గారెడ్డి కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే అనేక కీలక ప్రాజెక్టులు నిర్మించబడ్డాయని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా 1978లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో, స్థానిక నేతలు భాగారెడ్డి, రామచంద్రారెడ్డిల కృషితో మంజీరా డ్యామ్ నిర్మించబడిందని తెలిపారు. జంట నగరాల తాగునీటి అవసరాలను తీర్చడానికి మంజీరా , సింగూరు డ్యామ్‌లు కాంగ్రెస్ హయాంలోనే పురుడు పోసుకున్నాయని ఆయన వివరించారు.
కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నారనే బీఆర్ఎస్ ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న కేసీఆర్ , ఆయన కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ నిర్మించిన మంజీరా ప్రాజెక్టు నీటినే తాగి పెరిగారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయంగా కేసీఆర్ ఫ్యామిలీ హైదరాబాద్‌లోనే స్థిరపడిందని, అప్పటి నుంచీ అందుబాటులో ఉన్న నీటి వనరులను కాంగ్రెసే సమకూర్చిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టులు ఎప్పుడు వచ్చాయనే చరిత్రను ప్రజలు కూడా ఆలోచించాలని, కేవలం ఒకే ప్రాజెక్టును చూపించి మొత్తం తామే చేశామని చెప్పుకోవడం సరైనది కాదని జగ్గారెడ్డి ఈ సందర్భంగా హితవు పలికారు.