దేవుడి సొమ్ము చోరీకి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. కొద్ది రోజుల క్రితం నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాల వ్యవహారం కలకలం రేపింది. కాగా తాజాగా ఈ కేసులో మిస్టరీ వీడింది. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5.8 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కేసు విషయాలను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ వెల్లడించారు. రూ. 14.76 లక్షల విలువైన 5కిలోల 800 గ్రాముల వెండి బ్రిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పూజారి మామిడి కృష్ణ కిషోర్, రిటైర్డ్ ఈవో భాగవతం వెంకట నరసయ్య, ఆళ్లగడ్డ బంగారు వెండి వ్యాపారి దూదేకుల పెద్ద హుస్సేనయ్య అనే నిందితులను అరెస్టు చేశారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం (సోమవారం) రోజున స్వామివారికి అలంకరణ కోసం నగలను తీసి పరిశీలించగా, అసలు వెండి ఆభరణాల స్థానంలో నకిలీ వెండి నగలు కనిపించడంతో ఈ బాగోతం బయటపడింది. ఆలయానికి దాతలు సమర్పించిన కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులు సహా మరికొన్ని వెండి ఆభరణాలు మొత్తం 5.83 కిలోలు కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.