Jagga Reddy Requests KCR To Give Funds For Land: సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించిన దసరా వేడుకులకు హాజరైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమైక్య రాష్ట్రంలో తాను సంగారెడ్డికి ఒక ఐఐటీతో పాటు ఇంటింటికి మంజీరా నీళ్లతో పాటు ఎన్నో పనులు చేశానన్నారు. అయినప్పటికీ తనకు సంతోషం లేదన్నారు. ఎన్నికల ముందు తాను 50 వేల మందికి ప్లాట్స్ ఇప్పిస్తానని వాగ్దానం ఇచ్చానని.. తాను గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని ఆవేదన చెందారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుంటే, కచ్ఛితంగా తానిచ్చిన మాటని నిలబెట్టుకొని ఉండేవాడనన్నారు. కేసీఆర్ పెన్షన్లు ఇస్తున్నారు కానీ, తానిచ్చే ప్లాట్ల కారణంగా 20 ఏళ్లకు సరిపడ పెన్షన్ మొత్తం ఒకేసారి వచ్చేస్తుందని అన్నారు. సంగారెడ్డి పనులన్నీ సవ్యంగా సాగాలంటే.. మీ జగ్గారెడ్డిని మీరే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఒకవేళ మీరు కాపాడుకోలేకపోతే.. తాను తన పెళ్లాం పిల్లలతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లొస్తానని జగ్గారెడ్డి సరదాగా చెప్పారు. తన ఆధ్వర్యంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలో ఉన్న వాళ్లకు తాను ప్రతి ఒక్కరికీ రూ. 10 లక్షల విలువ చేసే ప్లాట్స్ ఇస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పుడు.. ఎవరో పది మంది ఓటు వేయనందుకు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తే, కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తారన్నందుకే వేయలేదని ఐదేళ్ల పిల్లాడు సమాధానం ఇచ్చాడని గుర్తు చేసుకున్నారు. అంటే.. ఉద్యోగాల పేరు మీద కేసీఆర్ చిన్న పిల్లల్ని సైతం ట్రాప్ చేశారని జగ్గారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌కి ఓ విజ్ఞప్తి చేశారు. 50 వేల ఇళ్ల కోసం నిధులు కేటాయిస్తే, తాను స్థలం చూపిస్తానని, వాటిని కొనేసి ప్రజలకు ఇచ్చేద్దామని అన్నారు.
ఇక రావణాసురుడు చాలా గొప్పవాడని, సీతమ్మని ఎత్తుకెళ్లి కూడా ఏం చేయలేదని జగ్గారెడ్డి అన్నారు. రాముడు కూడా మంచోడేనని, ఆయన నంబర్ వన్ మంచోడని చెప్పారు. రావణుడు నంబర్ 2 మంచోడని పేర్కొన్నారు. దసరా సందర్భంగా రావణుడ్ని తగలబెడుతున్నామని, మనకు పాలం తగలవద్దని ప్రార్థిస్తున్నానని అన్నారు. వర్సం పడుతున్నప్పటికీ జనాలు కదలడం లేదన్న ఆయన.. సంగారెడ్డి వాళ్ళు తూటాలు పడ్డా పక్కకు జరగరంటూ కార్యక్రమానికి వచ్చిన వాళ్లలో జోష్ నింపారు.