తెలంగాణ రైతుల పక్షాన తాము పోరాడుతున్నామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సాంప్రదాయ పంటలను వదిలేసి ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు చెప్పినందుకు రైతులు వరి పంటకు అలవాటు పడ్డారు. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుంటుందని మండిపడ్డారు. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 100 శాతం న్యాయం చేయలేవు.
పంజాబ్ లో 100 శాతం కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం వివక్ష చూపుతుందన్నారు జగదీష్ రెడ్డి. కేంద్రం ఎటువంటి సహాయం చేయకున్నా రైతులకు సమృద్ధిగా నీరు అందించాం. దేశంలోనే ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు సాదించిన రాష్ట్రంగా తెలంగాణాను మొదటి స్థానంలో నిలిపాం. తెలంగాణాను ఆదర్శంగా చూపాల్సిన కేంద్రం తెలంగాణా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు జగదీష్ రెడ్డి.
కోతల దశలో ఉన్న సమయంలో మెడ మీద కత్తి పెట్టి బాయిల్డ్ రైస్ ఇవ్వమని సంతకాలు పెట్టించుకున్నారు. వరి వెయ్యొద్దని చెప్పినా ప్రతిపక్ష బీజేపీ నాయకుల రైతులను మోసం చేసేలా వరి వేయమని ప్రోత్సహించి మోసం చేశారు. కేంద్ర దుర్మార్గ వైఖరిని , బీజేపీ దుష్ట రాజకీయాన్ని ఎండగట్టేందుకే నిరసన ధర్నా చేపడుతున్నామన్నారు. రైతుల కోసం మరో తెలంగాణా ఉద్యమంలా రైతు ధర్నా చేపట్టక తప్పదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
పార్టీ పిలుపుమేరకు వివిధ జిల్లాల్లో రైతులు తాహశీల్దార్ కార్యాలయాల దగ్గర నిరసన తెలిపారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలంటూ, పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.