తెలంగాణలో తాజాగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నేతల పైరవీలు, ఆశవాహుల ఎదురు చూపులతో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఒక మినీ యుద్ధమే నడుస్తుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆయా నేతలు తమ కంటే తమకు అని నేతలు ఎవరికి వారే పోటీ పడుతున్నారు. ప్రస్తుతం శాసనసభలో ఒక నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 120 స్థానాలు ఉండగా, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఖాళీ అయింది. మిగిలిన 119లో టీఆర్ఎస్కు 104, మజ్లిస్, కాంగ్రెస్ 6, బీజేపీకి 2, ఉన్నాయి. హుజురాబాద్ ఫలితం నవంబర్ రెండో తేదీన తేలనుంది.
అయితే అధికార పార్టీలో ఎమ్మెల్సీ స్థానాల కోసం గట్టీ పోటీ నెలకొంది. పదవీకాలం ముగిసిన గుత్తాసుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరనున్నారు. ప్రస్తుతం శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీకాలం జనవరి నాలుగో తేదీన ముగియనుంది. దీంతో గుత్తా లేదా కడియం ఎవరినో ఒకరిని శాసనమండలి చైర్మన్ పదవికి పరిగణలోకి తీసుకునే వీలు ఉంది. మహిళా కోటలో ప్రధాన సామాజిక వర్గంలో ఆకుల లలిత, నేతి విద్యాసాగర్, మైనార్టీల కోటాలో పరీదుద్దీన్లను మరోసారి ఎంపిక చేయాలని ఆయా నేతలు కోరుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు బండి రమేష్, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎల్ రమణ,మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఉన్నారు. వీరితో పాటు పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఇప్పటికీ పదవులు రాని నేతలు సైతం ఈ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఎదురు చూస్తున్న ఎంతోమంది నాయకులు ఈ సారి శాసన మండలి తమను పంపాలని అధిష్టానాన్ని కోరనున్నారు.
ఉత్తర భారతీయలు కోటాలో పార్టీ సీనియర్‌నేత నందకిశోర్ వ్యాస్ బిలాల్, మాజీ ఎంపీ సీతారామ్‌నాయక్, దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఆశావ హుల కోటాలో ఉన్నారు. అయితే పార్టీలో కి మరో బీసీ నేత చేరే అవకాశం ఉండటంతో ఒక ఎమ్మెల్సీ అతడికే ఇచ్చే అవకాశం ఉందని వినికిడి. దీంతో హుజురాబాద్ ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసిన నాయకులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు ఇవ్వాలని వారు కోరు తున్నారు. ఎవరెన్ని ఆశలు పెట్టుకున్నా టీఆర్ఎస్ అధిష్టానం ముందు ఎన్ని డిమాండ్లు పెట్టినా, పైరవీలు చేసినా తుది నిర్ణయం మాత్రం కేసీఆర్‌దే. అన్న విషయం ఆయా నేతలందరికి తెల్సిందే. దీంతో నేతలు ఎవ్వరికి వారు పైరవీలు చేస్తూ తమకే అవకాశం దక్కేలా ఆయా మంత్రులు, నేతలకు టచ్‌లో ఉంటున్నారు.