ధాన్యం కొనుగోళ్లు ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం నిర్మల్ జిల్లాలోని అంబేద్కర్ భవన్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా జిల్లాలో మొత్తం 43 రైస్ మిల్లులు ఉండగా.. అందులో 10 బాయిల్డ్.. 33 రా రైస్ మిల్లులు ఉన్నట్లు ఆయన తెలిపారు.
అయితే.. యాసంగి సీజన్‌లో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్న క్రమంలో.. 185 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో.. ఇప్పటికే 86 కేంద్రాలను ప్రారంభించి.. 7 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే.. ఆకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఈ నెల 31లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు.