హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో వైభవంగా జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు పాల్గొన్నారు. ఈ మేరకు సమతా మూర్తి విగ్రహాన్ని వారు దర్శించుకున్నారు. అనంతరం శ్రీరామనగరంలో కొలువై ఉన్న 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నారు. ఆ తర్వాత భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు నిర్దేశించారని తెలిపారు. భక్తితో ముక్తి లభిస్తుందని ఆయన వెయ్యేళ్ల కిందటే నిరూపించారని పేర్కొన్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎస్ సోమేష్‌కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి బేగంపేట నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు చేరుకున్నారు.