ఐ బొమ్మ రవి కేసు దర్యాప్తులో బయటపడిన అంశాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. పోలీసులు రివీల్ చేసిన కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారం, రవి తొలి నుంచే క్రిమినల్ మెంటాలిటీతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నేర స్వభావం ఉండడమే కాకుండా, స్నేహితుడు నిఖిల్ పేరుతో నమోదు చేసిన ఐడీ కార్డులను ఉపయోగించి అక్రమ కార్యకలాపాలు కొనసాగించినట్టు పోలీసులు గుర్తించారు. రవి నడవడి, అతని బ్యాక్‌గ్రౌండ్ గురించి కీలక వివరాలు కూడా బయటపడ్డాయి.
దర్యాప్తులో భాగంగా రవి భార్యను కూడా పోలీసులు విచారించారు. ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం, రవి తరచూ తనను, పిల్లలను చిత్రహింసలకు గురి చేసేవాడని తెలిపింది. కుటుంబంపై జరుగుతున్న వేధింపులు తట్టుకోలేకపోతేనే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది. రవి ఇంటి వ్యవహారాల్లోని ఈ అంశాలు అతడి వ్యక్తిత్వంపై మరింత అనుమానాలను పెంచుతున్నాయి.
అక్రమ కార్యకలాపాల్లో రవికి ప్రధాన మద్దతుదారుడిగా ఉన్న వ్యక్తి నిఖిల్. నిఖిల్ డిజైన్ చేసే పోస్టర్లు, గ్రాఫిక్ వర్క్ కోసం రవి అతనికి నెలకు రూ.50,000 ఇచ్చేవాడని దర్యాప్తులో తెలిసింది. ఆన్‌లైన్‌లో జరుగుతున్న బెట్టింగ్ మోసాల్లో వీరి పాత్రపై పోలీసులు మరింత దృష్టి పెడుతున్నారు.
ప్రత్యేకంగా, I Bomma సైట్‌లో రవి ఉపయోగించిన చిట్కాలు దర్యాప్తులో కీలకంగా మారాయి. సైట్‌లో బెట్టింగ్ యాప్ బగ్‌ను ఉపయోగించి జనరేట్ చేస్తున్న ట్రాఫిక్ ద్వారా రవి భారీగా డబ్బు సంపాదిస్తున్నట్టు కన్ఫెషన్‌లో పేర్కొన్నాడు. ఒక్క లక్ష వ్యూస్‌కే 50 డాలర్లు వసూలు చేస్తూ, ఈ అక్రమ మార్గంలో నిరంతరం ఆదాయం పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.