Kishan Reddy: అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025ను పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో ఉక్కు మరియు బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో రేపు (జూన్ 20న) ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే 24 గంటల కౌంట్‌డౌన్ వేడుకలకు భారీ ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ, భద్రత, సదుపాయాలు, వేదిక ఏర్పాట్లపై అవసరమైన సూచనలు చేశారు. ఇక, ఆయన మాట్లాడుతూ.. 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున దేశంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం.. విశాఖపట్నం వేదికగా యోగా కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
అయితే, 24 గంటల కౌన్ డౌన్ పేరుతో రేపు ఉదయం యోగ పండుగ నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు, సినీ హీరోలు, సినీ తారలు, యోగ గురువులు పాల్గొంటారని చెప్పుకొచ్చారు. మైదానంలోయోగా ఎగ్జిబిషన్ ఉంటుంది.. ఉదయం 5:30 నుంచి 7:30 గంటల వరకు యోగా కార్యక్రమం ఉంటుంది.. నగర ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యాక్రమంలో పాల్గొనాలని కోరారు. మన దైనందిన జీవితంలో యోగా చాలా ముఖ్యమైంది అని కిషన్ రెడ్డి వెల్లడించారు.