హైదరాబాద్‌లో లోన్ యాప్స్ అరాచకాలు మళ్లీ మొదలయ్యాయి. వారం రోజుల వ్యవధిలో సిటీ పోలీసులకు 4 ఫిర్యాదులు అందాయి. యూసఫ్‌గూడాకు చెందిన ఓ యువతి లోన్ యాప్ ద్వారా రూ.10 లక్షలు లోన్ తీసుకుంది. అయితే సదరు యువతిని వేధింపులకు గురి చేసి లోన్ యాప్ నిర్వాహకులు అదనంగా రూ.2.9 లక్షలు దండుకున్నారు. అలాగే కృష్ణానగర్‌కు చెందిన మరో మహిళ లోన్ యాప్ నుంచి రూ.33వేలు రుణం తీసుకుంది. అయితే గడువు తీరిందని ఫేక్ నోటీస్ లెటర్ హెడ్‌లతో కాల్ సెంటర్ నిర్వాహకులు బ్లాక్ మెయిల్ చేశారు.
అంతేకాకుండా కుటుంబీకుల ఫోన్ నెంబర్లను తీసుకొని వాటితో వాట్సాప్ గ్రూప్ తయారు చేసి కాల్ సెంటర్ నిర్వాహకులు బాధితురాలిని వేధించారు. దీంతో వేధింపులు తాళలేక బాధితురాలు తీసుకున్న రూ.33 వేల రుణానికి రూ.లక్ష చెల్లించింది. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే.. ఓల్డ్ సిటికి చెందిన ఆటో డ్రైవర్ గోక్యాష్ లోన్ యాప్ ద్వారా రూ.5వేల రుణం తీసుకున్నాడు. యాప్ కండిషన్స్ తెలియకుండానే బాధితుడు అన్ని షరతులను యాక్సెప్ట్ చేశాడు.
దీంతో తిరిగి చెల్లింపులు చేయకపోవడంతో లోన్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. దీంతో సదరు ఆటో డ్రైవర్ ఈనెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గతంలో కూడా లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులు భరించలేక చాలా మందే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ.. లోన్స్ యాప్స్ మాత్రం వాటి తీరును మార్చుకోవడం లేదు. కాల్ సెంటర్ నిర్వాహకులు లోన్ తీసుకున్నవారితో వ్యవహరించే తీరుపై పోలీసులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. అయినప్పటికీ వారి తీరు మారడం లేదు.