Sankranti Effect: బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వచ్చిన వారందరు ఇప్పుడు సంక్రాంతి పండగ కోసం పల్లెలకు పయనం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు వారి స్వగ్రామాలకు చేరుకోగా.. మరి కొందరు సొంతూళ్లకు వెళ్తున్నారు. పండుగ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ నెల 11 నుంచి 19 వరకు హాలీడేస్ ఇచ్చాయి. తిరిగి జనవరి 20వ తేదీన తరగతులు పునః ప్రారంభం కానుండటంతో.. స్కూల్స్, వసతి గృహాల్లో చదువుకుంటూన్న స్టూడెంట్స్ తమ ఊళ్లకు వెళ్లేందుకు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు. రద్దీ కారణంగా బస్సులో సీట్లు లేకపోవడంతో నిలబడే తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు.
Read Also: Madhya Pradesh: ఫ్రిజ్‌లో మహిళ మృతదేహం.. ఏడాది క్రితం హత్య..
ఇక, హైదరాబాద్ పట్టణ పరిధిలోని ప్రధాన బస్ స్టాప్‌ల దగ్గర జనం బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. బస్సులు రాగానే తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో సీట్ల కోసం ఎగబడుతున్నారు. మరోవైపు చాలా మంది సొంత వాహనాలు ఉన్న వారు కుటుంబంతో సహా కార్లు, మోటర్ సైకిళ్ల మీద తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి , కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఫోర్స్ బరిలోకి దిగింది. అలాగే, నగరంలోని అమీర్‌పేట్, కూకట్‌పల్లి, పెద్ద అంబర్ పేట్, ఆరాంఘార్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా సమాచారం. ఈ ట్రాఫిక్ తో ప్రయాణికులు, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.