SBI ATM Robbery: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాలలో ఈ నెల (మార్చ్) 3వ తేదీన జరిగిన ఏటీఎం చోరీ కేసును పోలీసులు చేధించారు. కార్లో వచ్చి గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంను తెరిచిన దోపిడి దొంగలు.. ఏటీఎంలో ఉన్న సుమారు 30 లక్షల రూపాయలను దోపిడీ చేసి పారిపోయారు. ఏటీఎం సెంటర్లో సైరన్ వైర్ ని కట్ చేసి, సీసీ కెమెరాలకు చిక్కకుండా స్ప్రే చేసిన దోపిడి దొంగలు.. సుమారు నాలుగున్నర నిమిషాల్లోనే ఏటీఎం చోరీ చేశారు.
Read Also: CBI Raids: మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు..
ఇక, ఏటీఎం దోపిడికి పాల్పడ్డ నలుగురు దోపిడి దొంగలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. అయితే, నిందితులు హర్యానాలోని మేవాత్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే, రావిర్యాలలో చోరీ చేసి కారులో ముంబై వైపు వెళ్తు మైలార్ దేవ్ పల్లిలోని మధుబన్ కాలనీలో ఉన్న మరో ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించారు.. అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడంతో.. దుండగులు పరార్ అయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు మేవత్ కు వెళ్లారు. స్థానిక పోలీసుల సాయంతో నిందితులను అరెస్టు చేశారు. దోపిడి దొంగల నుంచి గ్యాస్ కట్టర్లు, చోరీకి వినియోగించిన మేషిన్ ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.