Devaraj Arrested: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవకతవకల కేసులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్‌ను ఈరోజు (జూలై25) సాయంత్రం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీఏ స్కాం కేసులో ఏ2గా ఉన్న దేవరాజు.. ఉప్పల్ ఇన్ స్పెక్టర్ సమాచారంతో సీఐడీ నుంచి తప్పించుకున్నాడు. అతడ్ని పట్టుకోవడానికి 36 గంటల పాటు నిర్విరామంగా పని చేసి పూణెలో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, భద్రాచలం, కాకినాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపూరం, బెంగళూరు, పూణె, యానాం నగరాల్లో తిరిగిన దేవరాజు.. ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో దేవరాజును సీఐడీ అధికారులు పట్టుకున్నారు. కాగా, హెచ్‌సీఏపై కేసు నమోదైన తర్వాత దేవరాజు 17 రోజుల్లో 7 రాష్ట్రాలు తిరిగినట్లు గుర్తించారు. ఇక, అతడ్ని పట్టుకోవడానికి 6 ప్రత్యేక బృందాలు గాలించాయి.
Read Also: Minister Ponnam: బీసీ రిజర్వేషన్లను బీజేపీ నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది..
అయితే, దేవరాజ్ అరెస్ట్‌తో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య ఇప్పటి వరకు 6కు చేరింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఇవాళ బెయిల్ లభించింది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు సహా పలువురు మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన న్యాయస్థానం.. హెచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాస్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్‌లకు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు జగన్ మోహన్ రావును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.